పేరు లేని లేఖ!

"నిన్ను ప్రశ్నించే వీలు లేక,
నా భావాలను ఆపలేక,
తలంపులను దారి మళ్ళించలేక
రాసుకున్నాను ఈ ఊరు పేరు లేని లేఖ!"


ఏం చేశావు నువ్వు?
ఏం సాధించావు నువ్వు?
ఎందుకా నవ్వు? ఏదో సాధించి పెట్టావని అనుకుంటారంతా కానీ నీకు తెలుసుగా నీ అంతరాత్మకు తెలుసుగా అసలు నిజం.  ఇందులో నీ స్వార్ధం లేదూ? ఆత్మ కధ రాసుకున్నావే..ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోలేదా నువ్వు?
నీ వలన కాదూ వారు చనిపోయింది? నీ "చేతకాని మంచితనం" వలన కాదూ వారు మనకి కాకుండాపోయింది?
మనలో లేకుండాపోయింది? వారిని, వారి జీవితాన్ని ఆర్పేసి..నువ్వు మాత్రం వెలుగుతూనే ఉన్నావే..
 

ఆనాడు నీకు దెబ్బ తగలకుండా ఉండుంటే..నీకు పరాభవం జరగకపోయుంటే...నీకు నొప్పి కలగకపోయుంటే..నువ్వు స్పందించే వాడివా? తిరగబడే వాడివా? నడుం బిగించే వాడివా? 

నువ్వు నమ్మిన సిద్ధాంతానికి ఎంతమందిని బలి చేశావు...ప్రతిగా త్యాగశీలివని పేరొందావు.
నిజానికి త్యాగం వారిది కాదా?  అవును. తక్కిన వారు నీది మంచితనం అనుకోవచ్చును కానీ "మితిమీరిన మంచితనం" కూడా "చేతకాని తనం"గా పరిగణించబడుతుందని నీకు తెలియదా??? 
ఎందుకిలా చేశావని అడిగేందుకు నేడు నువ్వు లేవు. పైగా అడిగితే తప్పంటారంతా.
 

నిన్ను చంపితే నేరమన్నారు, ఘోరమన్నారు...మరి నువ్వు చంపిస్తే దాన్ని ఏమనాలి?
 

నిజమే కదా వారు ఎలా చనిపోయినా అందులో నీ మంచితనానికి కూడా భాగముంది అంటే...నువ్వు కూడా పరోక్షంగా కారకుడివే గా.. అన్నీ చేసిన నువ్వు మాత్రం బాగానే బతికావులే.. అయినా వారు నిన్ను క్షమించేస్తారులే (క్షమించేశారులే) ఎందుకంటే..వారి జన్మ ఉన్నదే "అమ్మ" కి అంకితమయ్యేందుకు కదా. నీ ద్వారా ఆ అవకాశం వారికి వచ్చిందని వారు భావించవచ్చు. కానీ నీ అంతరాత్మ క్షమించగలదా నిన్ను???  

ఎంత చేసినా నీ స్ఫూర్తి మాకు కావాలి, నీ కీర్తి శ్లాఘించాలి..
ఎందుకంటే..ఇప్పుడు మాకు కావలసినది...
బాధించే నిజాలకన్నా. బతికించే అబద్ధాలే.
నిజాలని కప్పెట్టాలి...కప్పెట్టి నిప్పెట్టాలి.

కాష్టంలో కాలిపోతున్న "నమ్మకాన్ని" కాపాడుకోవడం కోసం, నువ్వు కావాలి.
నాకు నచ్చకపోయినా మాకు నువ్వు కావాలి.
చచ్చిపోతున్న "విలువలని" బ్రతికించుకొనేందుకైనా నువ్వు రావాలి. 
కానీ ఈసారి మాత్రం ఎవ్వరి ప్రాణాలు తీయబోకు..తీయగా! 


శ్రీ!

Comments

Popular posts from this blog

ఎవరు గురువులు?

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)

"సేవ - అరుణోదయ సేవాశ్రం"