"వినాయక చవితి" వస్తోంది అంటేనే భక్తి కన్నా ఎక్కువగా పోటీ కనపడుతుంటుంది. విఘ్నాలను తొలగిస్తాడని వినాయకుడికి దండం పెట్టుకుని వీధిలోకి వెళ్తే ప్రతీ వీధిలోనూ అడ్డంగా కూర్చుని ఆయనే విఘ్నమై ఎదురవడమూ.. మరొక పక్క అలా ప్రతిష్ఠించిన విగ్రహాలు పర్యావరణాన్నే కాక పండుగ జరిపే పద్ధతిని కూడా కలుషితం చేస్తున్నాయన్న బాధ.., నాలో ఓ ఆలోచన కలిగించింది. అదే.. ఈ "వినాయకుని విన్నపం" 2014వ సంవత్సరంలో సరదాగా రాస్తే, చదివిన సన్నిహితులు చాలా బాగుంది, ఉపయోగపడే సందేశం కాబట్టి నలుగురికీ తెలిస్తే ఫలితం ఉండచ్చు కదా అంటే 2015వ సంవత్సరంలో ఇది బ్లాగులో పోస్ట్ చేశాను. ఇదివరకొకసారి అది షేర్ చేశాను. కానీ రాయడానికి వెనకున్నగల ప్రేరణ పంచుకుందామనిపించి ఇప్పుడిలా పంచుకున్నాను.
ఇక చదవండి..
ఇక చదవండి..
"వినాయకుని విన్నపం"
ఇంకో రెండు రోజుల్లో వినాయకచవితి ఉంది అనగా.. హఠాత్తుగా వినాయకుడు కనపడకుండాపోయాడు. కైలాసంలో హడావుడి మొదలైంది. ఇంతలో ఎలా తెలిసిపోయిందో మన దేవలోకంలోని మీడియా వారికి..వార్తలు ప్రసారం చేయటం మొదలుపెట్టేశారు కూడా.
" కైలాసంలో కలకలం..విఘ్ననాయకుని పండుగకే విఘ్నం. కనపడకుండా పోయిన గణనాదుడు..ఆందోళనలో తల్లి పార్వతి.
ముక్కంటి కంటికి కూడా కనపడని తన ముద్దుల తనయుడు."
మరో ఛానెల్లో..వార్తలు..
" వినాయకుని సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడం ఆశ్చర్యకరంగానూ పలు అనుమానాలకూ దారి తీస్తోంది.
నీవలన అంటే నీవలనే వెళ్ళిపోయాడంటూ ఒకరినొకరు నిందించుకుంటూ గొడవపడుతున్న శివ పార్వతులు, వారి గణాలు "
ఇంతలో ఒక వార్తా ఛానెల్లో ఫ్లాష్ న్యూస్.
ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..
" మీడియా ముందు ప్రత్యక్ష్యమైన గణనాధుడు. మీడియా వారికి ఇంటర్వ్యూ ఇస్తున్న గజముఖుడు "
ఇంటర్వ్యూ విశేషాలు ఇలా:
ఛానెల్
ప్రతినిధి: (ఛా. ప్ర.): స్వామీ ఇంతకీ మీరు ఎందుకు వెళ్ళిపోయారు? ఎక్కడికి
వెళ్ళిపోయారు? దీని ఆంతర్యమేమిటో కాస్త వివరిస్తారా?
వినాయకుడు (వి.): వెళ్ళిపోవడం కాదు నాయనా..పారిపోవలసి వచ్చింది.
ఛా. ప్ర.: పారిపోవడమా..?? మీరా???
వి.: అదేదో
సబ్బు అడ్వర్టైజ్మెంటులో "మమ్మీ నా? మీరా.?" అన్నట్లు అంటావెందుకు బాబు..
అవును సాక్షాత్తూ నేనే.. మీరు పెట్టే హింస తట్టుకోలేక పారిపోవలసి వచ్చింది.
చా. ప్ర.: మేము మిమ్మల్ని హింసపెడతామా అదేమిటి స్వామీ???
వి.: మరేమిటి బాబూ.. సరే ఒక విషయం చెప్పు. నీ పుట్టినరోజునాడు నువ్వెలా ఎంజాయ్ చేస్తావు?
ఛా. ప్ర.: నా
పుట్టినరోజు నాడా? కొత్త బట్టలు కట్టుకుని, గుడికెళ్ళి, పూజచేసుకుని,
అందరికీ స్వీట్లు పంచి, ఇంక సాయంత్రం ఫ్రెండ్స్ తో పార్టీలు..హబ్బో మస్త్
మజా చేస్తానుగా.
వి.: శ్రీరామనవమి నాడు, కృష్ణాష్టమి నాడు???
ఛా.
ప్ర.: శ్రీరామనవమి రోజున స్వామిని పూజించి, వడపపప్పు, పానకం పంచి పండగ
చేసుకుంటాము. ఇంక కృష్ణాష్టమి రోజున ఐతే..పాలు సమర్పించి, పాలకాయలు చేసి,
రకరకాలా పిండివంటలు చేసుకుని ఇంకా ఉట్టికొట్టి సంబరాలు చేసుకుంటాం.
వి.: అదే అదే..నేను చెప్పాలనుకున్నది కూడా. మరి నా పుట్టినరోజున మాత్రం నానా హంగామా చేసి నన్నెందుకు నాయనా చిత్రహింసలు పెడతారు?
ఛా. ప్ర.: నానా హంగామా ఏంటి స్వామీ అదంతా సాంప్రదాయం కదా?
వి.: సాంప్రదాయమా నీ బొందా? అసలు సాంప్రదాయం ఏమిటి నాయనా?
చక్కగా
మట్టితో కానీ, పసుపుతో గానీ, నా బొమ్మను చేసి దాన్ని పీటపైనో దేనిపైనో
ప్రతిష్ట చేసి, నాలుగు రకాల పండ్లతో పాలవెల్లి కట్టి, ఏదో నామమాత్రంగా
పిండివంటలు చేసి నాకు నైవేద్యం పెట్టి మీరు తినండ్రా అంటే..
వీధి
వీధికీ చందాలు పోగేసి వీధికో విగ్రహం పెడతారు..దాంట్లో మళ్ళీ మీలో మీకే
పోటీలు. మీ విగ్రహాలే అందంగా ఉండాలి, మీ విగ్రహాలే పెద్దవిగా ఉండాలి అని పెద్ద పెద్ద బొమ్మలు చేసి దానికి ఎక్కడలేని రంగులు పూసి..రంగోళీ
చేసి నాకు అక్కరలేని రంగులు పులిమి ముందురోజునే కూర్చోబెట్టి, పండగరోజున
ఏదో కానిచ్చేద్దం అన్నట్లు తూతూ మంత్రంగా పూజకానిచ్చేసి చేతులు
దులిపేసుకుంటారు. ఇహ ఆ తరువాత ఉంటుంది చూడండి నా బాధ.., ఆ బ్రహ్మయ్యకే
తెలియాలి స్టీరియో సౌండ్లలో పిచ్చి పిచ్చి రికార్డు పాటలుపెట్టి
మోతమోగిస్తారు.
తప్పించుకునే వీలుకూడాలేకుండా కూర్చోబెట్టి, డాల్బీ స్టీరియో సౌండుతో ఇంతపెద్దచెవులూ చిల్లు కాదు తూట్లుపొడుస్తారు...ఓహ్ మై డాడ్..
ఎవరితో చెప్పుకోను?
పోనీ ఆ పాటలేమైనా భక్తిపాటలో లేక మా నాన్నవో అమ్మవో అయితేనన్నాఫర్వాలేదనుకుంటే.."కెవ్వు..కేక. ." లూ "రచ్చ రంబోలా"
లూనూ వీళ్ళ భక్తి మండిపోనూ.. ఎవరికోసం పెడతారయ్యా ఆ పాటలు? నాకోసమా???
నేను వింటాననా?? వినాలనా??? అసలు ఇలా సినిమా పాటలు పెట్టి దీన్ని భక్తి
అంటారా???
ఇంకా
అంతా అయిపోయి నిమజ్జనం రోజున చూడాలి..పెద్ద సౌండ్లతో నన్ను ఊరేగించి హోళీ
పండగరోజు చల్లినట్లు రంగులు చల్లి ఆ రంగుల్లో నన్నూ
ముంచేసి నిమజ్జనం పేరుతో ఏదో ఒక గుంటలో నన్ను తోసేసి చేతులు
దులిపేసుకుంటారు..
కానీ
మీరు చేసిన ఈ హంగామాతో వాతావరణాన్ని ఎంతగా కలుషితం చేస్తున్నారో, పైగా
నన్నుకూడా ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా?
మీ
ఆత్రం మీదే తప్ప, మట్టితో కాక ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోనూ, వేరే రసాయనాలూ
వాడీ నా బొమ్మలుచేస్తారు. నాకు అక్కరలేని, ఎక్కడలేని రంగులను అద్ది, వాటిని నిమజ్జనం పేరిట నీళ్ళ గుంటలలోను, చేరువుల్లోను పడేస్తే.. ఆ నీళ్ళు
కలుషితమయ్యి, అవి తాగే మనుషులు, లేదా మూగ జీవాలకు, రోగాలు రావడమే కాక
మృత్యువాత కూడా పడతాయని గ్రహించారా? పైగా ఈ "ప్రాసెస్" మొత్తానికీ
రికార్డుపాటల హంగామాతో ధ్వని కాలుష్యం కూడాను.
ఇలా నానా రభస చేసి భక్తిశ్రద్ధలతో చేసినట్లు కట్టింగులిచ్చి, వరాలడుగుతారా???
అందుకే నా పుట్టినరోజు వస్తోందంటేనే నాకు వణుకుపుడుతోంది.
దయచేసి అర్ధిస్తున్నాను మహాప్రభో..
ఇకనుండైనా ఈ రంగుల హంగులను వదిలి మీ ఆర్భాటాలను పక్కనపెట్టి, సాంప్రదాయబద్ధంగా పూజచేస్తే సంతోషిస్తాను.
సర్వేజనా సుఖినోభవంతు. అంటూ అంతర్ధానమైపోయాడు వినాయకుడు.
ఇంక మన మీడియా వారు..ఏదో వేడి మీద ఈ ఇష్యూని కాస్త హైప్ చేసి తరువాత షరా మామూలుగా మిగిలిన వార్తల్లో మునిగిపోయారు.
పోనీ మనమైనా ఆ స్వామి విన్నపాన్ని మన్నిద్దామా???
వినాయకచవితి శుభాకాంక్షలతో...
శ్రీమూర్తి కొంపెల్ల
Comments
Post a Comment