"సేవ - అరుణోదయ సేవాశ్రం"


"సేవ - అరుణోదయ సేవాశ్రం"


సంప్రదించవలసిన నంబరు: 9848539767 
( ఫోన్ నంబరులో చిన్న సవరణ: త్వరలో పై ఫోటో లోని -  పైన పేర్కొనబడిన బోర్డులోని నంబరు తీసివేసి, ఈ కొత్త నంబరు చేర్చబడుతుంది. )

వయసుమీరిన వారికి పెద్దగా కోరికలుండవు. వారు కోరుకునేది ఒక తోడు అంతే. కానీ అదే లేకపోతే? ఆదరణ మాట దేవుడెరుగు, కనీసం నిలువ నీడైనా లేకపోతే? అందుకే అలాంటివారికోసం ఒక ఆశ్రమాన్ని స్థాపించాలన్న సంకల్పంతో తన స్వంత స్థలంలోనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసింది ఆమె. ఆమె శ్రీమతి మంజూష. అదే "సేవ - అరుణోదయ సేవాశ్రం" రంగంపేటలోని "శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాల" కు కాస్త ముందుగా అదే రోడ్డులో (నాగయ్యగారిపల్లె, చంద్రగిరి మండలం లో) ఉంది ఆ ఆశ్రమం.   ఒక సగటు సాదారణ మహిళ ఆలోచనకు అందమైన రూపం అది. 

మనం మన జీవితంలో ఎన్నోకష్టాలు పడ్డామనుకుంటుంటాం. అయినా బతుకుతున్నాం అనుకుంటుంటాం. అవును "బతికేస్తున్నాం" కానీ ఆదరించే వారు లేక అయినవారుండీ ఆదరణకి నోచుకోలేకపోతూ కూడా వారు "జీవిస్తున్నారు". అవును మనం బతుకుతున్నాం వారు జీవిస్తున్నారు. అక్కడ ప్రతీ మంచానికీ ఒక కధ ఉంది. ప్రతీ కధలోనూ వ్యధ ఉంది. అయినా వాటిని లెక్కచేయని వారి చిరునవ్వు  మనకి కూడా జీవించగలమన్న ధైర్యాన్నిస్తుంది.  వయసుడిగిన మనిషికి ఇంక ఏం కావలసి వస్తుంది? ఒక తోడు తప్ప, తన గోడు వినే ఒక మనసు తప్ప.
ఈరోజు వాళ్ళని కలుద్దామనీ, తోచిన సాయం చేద్దామని వెళ్ళిన మాకు వాళ్ళ ప్రేమని పంచుతుంటే. ఇవ్వడానికి వెళ్ళి మేము తీసుకున్నట్లనిపించింది. నిజమే ఇవ్వడానికి వెళ్ళి మాతో వారు పంచిన ప్రేమను, తద్వారా పొందిన ఆనందాన్నీ తెచ్చుకొన్నాము మేము.

అక్కడ దాదాపు ఒక పాతికమంది ముసలివారికి వసతి సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...వారి జీవనోపాధికి రకరకాల కూరగాయలను వారే పండించుకుంటారు, పండించుకుని వారి ఆహారం వారే వండుకుంటారు. దీనికి అన్ని సదుపాయాలు, సమకూర్చబడ్డాయి (ఇది ఇక్కడ నేను ఫోటోలు తీసి చూపించడంకంటే అవి మీరు మీ కళ్ళారా చూస్తేనే ఇంకా బాగుంటుంది). వీరి వైద్య సహాయార్ధం, "డాక్టర్ శ్రీ గంగిరెడ్డి" గారు అందుబాటులో ఉంటారు. వీరికి మందులు, వగైరాలు "డాక్టర్ రెడ్డీస్ లేబ్స్" వారు సమకూరుస్తారు. అప్పుడప్పుడు ఎవరో దాతలు ఎప్పుడో ఒకసారి వారికి తోచిన సాయం చేస్తుంటారు. అంతా బానే ఉంది కానీ, కేవలం ఒక్కరితో మొదలై కొద్దిమంది దాతల సాయంతో నడుస్తున్న ఈ ఆశ్రమానికి ఇవి తాత్కాలికంగా కొద్ది కాలం సరిపోగలవు కానీ, వీరికి "ఆర్ధిక"  మరియూ "హార్ధిక" సాయం కూడా చేయగలిగే దాతలు మరికొందరు కూడా తోడైతే. శ్రీమతి మంజూష గారు వారి సేవలను మరింత మెరుగుపరచగలరు.      

పెళ్ళి కార్డులలోనూ, ఏదైనా ఫంక్షన్లకు ఆహ్వానించేప్పుడు ఆ పత్రికలలోనూ చివరన "తమ రాకకు ఎదురు చూచు వారు" అని  రాస్తారు. 

కానీ ఇంకిన కన్నీటి కళ్ళతో ఈ అమ్మమ్మలు, తాతయ్యలు అదే ఆశిస్తున్నారని తెలిసినప్పుడు , 
కాసేపు సరదాగా గడిపితే ఆ క్షణాలతో వారు మరో జీవితకాలం సంతోషంగా గడిపెయ్యగలరని తెలిసినప్పుడు, 
మన జీవితంలో కొంత సమయం, కేవలం కొద్ది సమయం మరి కొందరి జీవితాలను వెలిగించగలదని తెలిసినప్పుడు, వారికోసం మనమున్నామన్న ఒక్క నమ్మకమే వారిని బతికించగలదని తెలిసినప్పుడు...,
మనుషులుగా మనం ఈమాత్రం చెయ్యలేమా?

నిజమేగా వారికి ఈ వయసులో కావలసినది ఆస్తులు కాదు ఆప్తులు.

"ఆర్ధిక"సాయం చేయదలచిన వారు 
9848539767 నంబరుకు -  సంప్రదించగలరు.
 "హార్ధిక"సాయం అందించదలచిన వారు నేరుగా వెళ్ళి వారి మనసులను స్పృశించి, వారి పెదవులపై చిరునవ్వులు పూయించగలరు.  
 

ధన్యవాదాలు!

Comments

Popular posts from this blog

ఎవరు గురువులు?

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)