అంకితం..
కపిల్ కుందు కి 22 ఏళ్ళు.. చిన్నప్పటి నుండి చాలా చురుకైనవాడు. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాడు మార్కులు ఒక్కసారైనా 90 కి తక్కువ వచ్చేవి కావు. ఎంత తెలివిగలవాడో అంత మృదుస్వభావి తను. అందుకే తనంటే స్నేహితులకే కాదు టీచర్లకూ అంత ప్రేమ. విధి నిర్వహణ నిమిత్తం, తల్లితండ్రులకు దూరంగా ఎక్కడో ఉంటున్నాడు. తను ఎక్కడున్నా మనసంతా తల్లితండ్రుల గురించిన ఆలోచనలే. కానీ విధి నిర్వహణ పట్ల తన విధేయత, ఆ ప్రేమను సైతం అధిగమిస్తోంది.
ఇక్కడ తల్లితండ్రులు ప్రాణం పెట్టుకుని తన కోసం చూస్తుంటారు. ఎప్పుడో చుట్టపు చూపుగా వచ్చివెళ్ళే కొడుకుని చూసుకుని మురిసిపోతారు. కానీ మురిసినంతసేపు పట్టదు.. తను విధి నిర్వహణ నిమిత్తం తిరుగు ప్రయాణమైపోతాడు. ఈసారి ఎప్పుడెప్పుడొస్తాడా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తోంది ఆ తల్లి.. ఇంకో వారం రోజుల్లో అతనికి 23 ఏళ్ళు నిండుతాయి కొడుకు పుట్టినరోజు నాడున తను దగ్గరలేనందున ఈసారి వచ్చినప్పుడైనా పండుగలా జరపాలనుకున్నారు ఆ తల్లితండ్రులు. ఎంతో ఆశగా ఎదురుచూస్తే ఈసారి ఆ కొడుకు మృతశరీరమై వచ్చాడు. విధినిర్వహణలో ప్రాణాలర్పించాడతను.
***
ఉత్తరాఖండ్ లోని శివపురి గ్రామంలో జన్మించాడు మన్ దీప్ సింగ్. తండ్రి మాజీ-సైనికుడు. తమ్ముడు జమ్ము- కాశ్మీర్ లోని భారత ఆర్మీలో సైనికుడు. 26 ఏళ్ళ మన్దీప్ కు ఈ ఏడాదే పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నారు తల్లితండ్రులు. ఎక్కడున్నా అమ్మతో ఓ సారి మాట్లాడకపోతే తోచదు మన్దీప్ కు. సోమవారం సాయంకాలమే తల్లితో ఫోనులో మాట్లాడుతూ తను క్షేమంగా ఉన్నానంటూ ధైర్యం చెప్పాడు. తన క్షేమ సమాచారం అందించి 24 గం||లు కూడా కాలేదు మరుసటి రోజే తమ కొడుకు మరణ వార్త చేరింది ఆ తల్లితండ్రులకు.
***
హమీర్ సింగ్ ది కూడా ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లోని ఫోక్రియాల్ గ్రామం తనది. 27 ఏళ్ళ హమీర్ కు రెెండేళ్ళ క్రితమే పెళ్ళైంది. ఒక పాప కూడా. ఎంతో నమ్మకంగా ఈసారి వస్తానని చెప్పి వెళ్ళిన హమీర్ ఈసారి త్రివర్ణ పతాకం చుట్టబడి వస్తాడనుకోలేదు ఆ భార్య.
***
నిజానికి వీళ్ళేవ్వరికీ మనం తెలియం. మనకి కూడా వీళ్ళెవరో తెలీదు. కానీ వీళ్ళందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టినది మన కోసం. మనందరి కోసం. ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన మన వీర జవాన్లు వీరంతా. ఇది ఏ ఒక్క కపిల్ కుందు, మన్దీప్ సింగ్, హమీర్ సింగ్, ల కథ మాత్రమే కాదు.
మనకి స్వేచ్ఛా వాయువునిస్తూ తాము వెలుగులోకి రాకుండా అలానే తెరమరుగున ఉన్న ఎందరో వీర జవాన్ల కథ ఇది.
కాదు.. కాదు..
కాదు.. కాదు..
ఇది నిజం. వారే నిజం.
ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనమందరమూ జెండా ఎగరేసి, సెల్యూట్ చేసి మన స్వాతంత్ర్య వీరులను స్మరించుకుంటాం. కానీ వారితో పాటే తలుచుకోవలసిన మన అమర జవాన్లను విస్మరిస్తాం. ఎప్పుడో.., ఎక్కడో.., వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడితేనో లేక ఉగ్రవాదుల దాడి నుండి మన దేశాన్ని రక్షిస్తేనో ఆ సమయాల్లో మాత్రమే వీరి ఉనికి మనకి తెలుస్తుంది, వీరి సేవ మనకి కనిపిస్తుంది. అప్పుడొక్కసారి వారికి సెల్యూట్ చేస్తాం. కానీ మనం బ్రతికే ఉన్నామన్న రుజువు వారి రుణం అన్నది, అనుక్షణం దేశరక్షణకే అంకితమైన వారి జీవితం మనం మరెప్పుడూ పెద్దగా తలుచుకోము.
మనకి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మన స్వాతంత్ర్య వీరుల పట్ల కృతజ్ఞతతో ఎలా అయితే ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజున వారిని తలుచుకుంటున్నామో.., అలానే మనం బ్రతికున్న ప్రతిక్షణమూ మన దేశ సైనికుల పట్ల బాధ్యతగా కూడా ఉండాలి. ప్రతి సంవత్సరం జెండా పండుగ జరుపుకునేప్పుడు మన స్వాతంత్ర్య వీరులను ఎలాగైతే
తలుచుకుని అభివందనం చేస్తామో అలానే ఆ సంవత్సరంలో దేశ రక్షణలో అసువులు బాసిన అమర జవాన్లనూ ఒక్కసారి తలుచుకుందాం. మన పిల్లలకూ అలవాటు చేద్దాం.
మనతో ఏ బంధం, సంబంధం లేని వారు, కనీసం మనమెవరమో కూడా తెలియని వారే సరిహద్దుల్లో నిలబడి మనకోసం పనిచేస్తుంటే, మనల్ని బ్రతికిస్తుంటే మనకి బ్రతుకునిస్తుంటే.., తోటి మనిషికి మనమెలా సాయపడగలమో ఆలోచించమని నేర్పిద్దాం. సాయం చేయాలంటే ఏ సంబంధం అవసరం లేదని తెలుపుదాం.
వారి సేవానిరతినీ, విధేయతనీ మన పిల్లలకు తెలిపి వారు ఒక మంచి దృక్పధాన్ని అలవరచుకొనేలా చేద్దాం
🇮🇳 జైహింద్ 🇮🇳
Jai Hind vandemataram....yes what you have said is absolutely correct
ReplyDelete:-)
Delete