నివాళి
                        ★~~💐🇮🇳💐~~~★



మొన్న ఫిబ్రవరి పధ్నాలుగునపుల్వామాలో మన సీ.ఆర్.పీ.ఎఫ్. జవాన్ల పైన జరిగిన ఉగ్రదాడి నేపధ్యంలో సంఘీభావం తెలుపుతూ అటు వాట్సాప్ లోనూ ఇటు ఫేస్-బుక్ లోనూ మెసేజ్ లు ప్రవాహంలా వస్తున్నాయి.
ఉగ్రదాడిని ఖండిస్తూ అందుకు ప్రతీకారంగా మనం విహార యాత్రకి వెళ్ళదలచుకుంటే కాష్మీరుకి వెళ్ళడం మానుకోవాలనీ, అలాగే  కాష్మీరీలు అమ్మే ఎటువంటి వస్తువులను కొనకూడదనీ, తద్వారా కాష్మీరులోని ఉగ్రవాదులకు నిధులను స్థంబింపచేయచ్చుననీ ఒకరు పంపితే, దెబ్బకు దెబ్బ తియ్యవలసినదే వారినీ ఊచకోత కొయ్యాలంటూ ఒకరూ, అసలు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలి అంటూ మరొకరూ,  వీర దేశభక్తితో మెసేజ్ లు పంపుతున్నారు. తప్పనికాదు.

కానీ వీటిలో నన్ను ఆలోచింప చేసిన ఒక ముఖ్య సందేశం కాష్మీరీలకు సహాయ నిరాకరణ. నాదొక సందేహం. కాష్మీరు మన భారత భూభాగంలోనిదే కదా.

మన కాష్మీరుని దౌర్జన్యంగా ఆక్రమించాలని చూస్తున్న పాకిస్తాన్ ని నియంత్రిస్తూ కాష్మీరుని కాపాడుకుంటుంన్నాం కదా.

ఆ కాష్మీరులో నివసించే వారందరూ తీవ్రవాదులు కారుగా? మరి, పైన చెప్పిన విధంగా చేస్తే వారి కడుపు కొట్టినట్టు కాదా?

మన దేశాన్ని నాశనం చెయ్యాలని చూసే వారెవ్వరికీ  మనం పరోక్షంగా కూడా ఇసుమంతైనా సాయపడకూడదు నిజమే.

మరి అలాంటప్పుడు, పాకిస్తాన్ కి అండగా నిలబడుతున్న చైనా దేశ వస్తువులను మాత్రం ఎందుకు నిషేధించం మనం? వాటిని ఎందుకు వ్యతిరేకించం? పైగా ఎగబడి మరీ చైనా వస్తువులను, మొబైల్స్ కొంటుంటాం. దీపావళి పండుగ వస్తే చైనా టపాకాయలు కూడా కొంటున్నాం. మరి ఆరకంగా మనం శత్రుదేశాలకు సాయపడటం లేదంటారా??

చేతిలో చైనా మొబైలుంది. మనం స్మార్ట్ కాకపోయినా మన మొబైల్స్ చాలా స్మార్ట్.  భావోద్వేగంలో ఏది తోస్తే అది టక టకా టైప్ చేసి మెసేజ్ పెట్టడం చాలా సులువైన పని.

కాష్మీరుకి సహాయనిరాకరణం చెయ్యడం, పాకిస్తాన్ ని నాశనం చెయ్యటం వంటి ఆలోచనా ధోరణి వలన, మన దేశం పైన, అసువులు బాసిన అమర జవాన్ల పైన మనకున్న ప్రేమ కన్నా.., పక్క దేశం పైన మనకున్న ద్వేషం ఎక్కువగా ప్రకటితం చేస్తున్నామా అని సందేహం కలుగుతోంది.

నిజంగా మనం మన అమర జవాన్లకి నివాళులని అర్పించదలిస్తే.. వాట్సాప్ లో DPలు మార్చడం, కొవ్వొత్తులు వెలిగించడం, ఇవి చేస్తే సరిపోతుందా?

మరేం చెయ్యాలి?
మనమేం చెయ్యగలం?

ఏం అవసరం లేదు. ఎవరైనా సాటి వ్యక్తి నుంచి ఏం కోరుకుంటారు? ప్రేమ, ఆప్యాయత. ఇది ఇవ్వలేమా మనం?

మనలో ప్రతి ఒక్కరం మన అమర జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ స్వయంగా లేఖ రాసి పంపితే  ఇంతమంది అండగా ఉన్నారన్న బలం
వారికి ఇచ్చినవాళ్ళమవుతాం. అలాగే ఎప్పుడైనా మనం
వీలైతే వారు నివసిస్తున్న ప్రాంతానికి వెళ్ళి వారిని స్వయంగా పలకరిస్తే వారికి ఎంత ఆనందం పంచినవారమవుతాం?

వారికి ఆర్ధికంగా అండగా నిలబడడం, హార్ధికంగా తోడవడం మనం చెయ్యచ్చు. చెయ్యగలం.

ఇక ఎప్పుడైనా, ఎక్కడైనా మన జవాన్లు తారసపడితే వారికి ఒక ప్రేమ పూర్వకమైన వందనం చేస్తే వారికి మనం రుణపడి ఉన్నామన్న విషయాన్ని వారికి మనః పూర్వకంగా తెలిపినవారమవుతాం.

ఆలోచించండి..🙏

💐🇮🇳 జైహింద్ 🇮🇳💐

- శ్రీమూర్తి కొంపెల్ల

Comments

Popular posts from this blog

ఎవరు గురువులు?

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)

"సేవ - అరుణోదయ సేవాశ్రం"