ఓ బేబి! 
ఇది రివ్యూ కాదు కేవలం నా వ్యూ.

సాధారణంగా ఎవరైనా మనల్ని "దేవుడు ఎదురై వరమిస్తే నువ్వేం కోరుకుంటావు?" అని ప్రశ్నిస్తే.. ఆ.. ఇది జరిగేదా ఫాడా.. అన్న ఉద్దేశ్యంతో ఏదో చిలిపి కోరికలను వెలిబుచ్చుతుంటాం. అప్పుడప్పుడూ సరదాగా ఇలాంటి చిలిపి ఆలోచనలూ ఊహలూ కలుగుతుంటాయి. అలాగే "వయసైపోయాక చేజారిపోయిన యవ్వనం తిరిగి వస్తే..??" అని ఓ కొరియన్ దర్శకుడికి కలిగిన చిలిపి ఆలోచనకు దృశ్య రూపమే కొరియన్ చిత్రం - "మిస్ గ్రానీ".

ఆ చిత్రానికి రీమేకే నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన "ఓ బేబీ".

లక్ష్మి (బామ్మగా) - సమంత(పడుచు పిల్లగా మారిన బామ్మగా), ప్రధాన పాత్రలో నటించగా రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నాగశౌర్య, బాల నటుడిగా గుర్తింపు పొందిన తేజ, ఇతర తారాగణం.

"అమ్మలురా.. మనకి తిండి పెట్టేదీ వాళ్ళే మన చేత తిట్లు తినేదీ వాళ్ళే",

"అన్నది మనవాళ్ళే కదా! మన మంచి కోసమే కదా! మనకి ఇంక ఇగో ఎందుకు?"

"ఇంట్లో అమ్మమ్మో, తాతయ్యో, నాన్నమ్మో లేకపోతే ఎవరడుగుతార్రా మనల్ని తిన్నావా.. ఉన్నావా అని?"

"వాళ్ళున్నంత వరకేరా మనం చిన్న పిల్లలం, వాళ్ళు పోతే వాళ్ళతో పాటూ మన బాల్యాన్ని కూడా తీసుకుపోతార్రా.."
- వంటి ఎన్నో మనసుకు హత్తుకునే డైలాగులు ఆలోచింపచేస్తాయి. కాదు.. కాదు.. వయసైన తల్లిదండ్రులని ఓల్డేజ్ హోంలలో వదిలేసిన / వదిలెయ్యాలన్న ఆలోచనలో ఉన్న కనీసం కొందరిలోనైనా ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుందనిపిస్తుంది.

సావిత్రిగా (బేబక్కగా) - శ్రీ లక్ష్మి, ఆ బామ్మ కి కొడుకైన నానిబాబుగా రావు రమేష్, బేబక్కకి ఆప్తమితృడైన చంటి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, చంటి కూతురి పాత్రలో సునయన (ఫ్రస్ట్రేటెడ్ మదర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ వీడియోలు చేసే యూట్యూబ్ ఫేం సునయన), చంటి మరదలు సులోచనగా ఊర్వశి,  బామ్మకు ముద్దుల మనవడు రాకీ గా తేజ, స్వాతిగా మారిన బామ్మను ప్రేమించే విక్రమ్ పాత్రలో నాగశౌర్య, తమ తమ పాత్రలలో ఒదిగిపోయారు.

ఇక "అందమైన బొమ్మ" లాంటి సమంత "బామ్మ" చేష్టలతో, చాదస్తంతో, అద్భుతమైన నటనతో అందరినీ కట్టి పడేసింది.

ఛీదరించుకునే వారే కానీ ఆదరించేవారు లేని వయసైన వారి వ్యధ, తల్లీ-భార్యల మధ్యన నలిగే ఓ కొడుకు కథ, అత్తా-కోడళ్ళ నడుమ నిరంతరం నడిచే సొద, వెరసి..

"ఓ బేబి",

కొన్ని నవ్వులూ, కొన్ని కన్నీళ్ళను పూయించే ఓ అందమైన కుటుంబ కథా చిత్రం.

సందేశాత్మక చిత్రాల ఆవశ్యకం ఉన్న తరుణంలో, మనసుకు హత్తుకునే డైలాగులు, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో పాటు సున్నితమైన అంశాన్ని స్పష్టమైన సందేశంతో దర్శకురాలు "నందిని రెడ్డి" ఓ చక్కని చిత్రాన్ని అందించారు.

సందేహం: అంతా బాగుంది కానీ.. 70 ఏళ్ళ తల్లి ఎంత పాతికేళ్ళ పడుచు పిల్లగా మారినా అప్పటి తన తల్లి ఫోటో అయినా కొడుకు నానిబాబు చూసుండడా?? పోనీ ఫోటో లేకపోయినా, 19 ఏళ్ళకు పుట్టిన కొడుకు కి ఆరేళ్ళ ప్రయాణానికి తల్లికి పాతికేళ్ళు వస్తాయి కదా మరి ఆరేళ్ళప్పుడు చూసిన తల్లి ముఖమైనా గుర్తుండదా??

- శ్రీ మూర్తి కొంపెల్ల

Comments

Post a Comment

Popular posts from this blog

ఎవరు గురువులు?

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)

"సేవ - అరుణోదయ సేవాశ్రం"