మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)

ఎనిమిదేళ్ళకే గణ, యతి ప్రాసలంటే తెలియకుండానే తన మొదటి గీతం రాసి, పదో ఏటే తన మొదటి నవల రాసి, పదిహేనేళ్ళకే ఒక నవల అచ్చు వేయించి, పద్దెనిమిదేళ్ళకే ఖండకావ్య సంపుటి రాసి, తండ్రిగారు ఇచ్చిన డబ్బుతో దాన్ని అచ్చు వేయించి అలా అడుగేసిన శ్రీశ్రీ.. ఈ శతాబ్దం నాదంటూ నినదించి, నడిపించిన శ్రీశ్రీ..

"సినిమాకవికి సినిమా నిర్మాణంలో తనదిగా చెప్పుకోవడానికి ఏమీలేదు కనుక.. నేను తెలుగు సినిమాకవినని చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పుకుంటాను.., కాకపోతే నా ఆశయాలనీ, భావాలనీ లక్షలాది ప్రజలకి తెలియజేయటానికి "సినిమా"ని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాను" అని చెప్పాడు.

ఒక్కసారి శ్రీశ్రీ సినీరచనలను గమనిస్తే ఎన్నో పార్శ్వాలు.

"నా హృదయంలో నిదురించే చెలీ..(ఏ.ఎన్.ఆర్. ఆరాధన)" అంటూ ప్రేమ పాట రాసి, ఆ చెలి ఎవరని అడిగితే.. "కమ్యూనిస్ట్ పార్టీ" అని సమాధానమిచ్చిన చతురుడు. "కూటికోసం కూలి కోసం.. (ఆకలిరాజ్యం)" అంటూ ఆకలి కేకలు వినిపించి, ష్టజీవికి ఇరువైపులా నిలిచిన వాడే కవి అని నిరూపించినవాడు. ఎవరిమీదా ఆధారపడకుండా, మనిషి ముందు తనని తాను నమ్ముకోవాలని చెబుతూ.. "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా.. (భూమికోసం)" అని మనిషిలోని దైన్యాన్నీ, జడాన్నీ, బాపి భుజం తట్టి నడిపే ప్రేరకుడు. "తెలుగు వీర లేవరా.. (అల్లూరి సీతారామరాజు)" అంటూ విప్లవశంఖారావం పూరించి జాతిని జాగృతం చేసిన అగ్నిశలాక
(ఈ పాటకు గానూ 1975లో జాతీయ అవార్డును అందుకుని, తెలుగు సినీరచనకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిన ఘనుడు. అంతేకాక అదే పాటలో.. ఒకచోట "సింహాలై గర్జించాలీ" అని ఉండడం వ్యాకరణదోషం అవుతుందనీ ఆచోట "సింహంలా గర్జించాలీ" అని ఉండవలసినదనీ ఎవరూ గుర్తించక పోయినప్పటికీ, తన తప్పిదాన్ని తానే ఒప్పుకున్న సచ్ఛీలుడు. "సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం.. (ఎన్.టి.ఆర్. యమగోల)" అంటూ తన పేరు వింటేనే భూలోక జనాలు జడుసుకునే ఆ యముడికే దడ పుట్టించిన ఉద్దండుడు. "కల కానిదీ, విలువైనదీ బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు.. (వెలుగునీడలు)"  అంటూ ప్రేరణ నింపి చావు వాకిలి తలుపు తట్టిన వ్యక్తి చేతే ఆ తలుపును శాశ్వతంగా మూయించిన స్ఫూర్తిదాత. (ఈ పాట విని, ఆత్మహత్య చేసుకోవాలన్న తన ఆలోచనను శాశ్వతంగా విరమించుకున్నట్లు తెలుపుతూ ఒక వ్యక్తి అప్పట్లో శ్రీశ్రీ కి జాబు రాశారు).

ఇవన్నీ అటుంచితే.. వ్యక్తిగతంగా తాను నాస్తికుడైనప్పటికీ..

"తిరుపతి వెంకటేశ్వరా దొరా నీవే దిక్కని నమ్మినామురా.. (మాంగళ్యబలం), అని ఆ వెంకన్ననీ వేడుకున్నాడు, "నందుని చరితము వినుమా...పరమానందము గనుమా (జయభేరి)" అంటూ ఆనందంగా ఆ కృష్ణలీలను గురించీ తలచుకున్నాడు.

ఇలా ఒకటా..? రెండా..?

ఆకాశవీధిలో అందాల జాబిలీ (మాంగళ్యబలం), జోరుగా హుషారుగా షికారు పోదమా (భార్యాభర్తలు), మనసున మనసై (డాక్టర్. చక్రవర్తి)  అంటూ ఇంకా ఎన్నో.. సుమధురగీతాలనూ రచించి తన కలానికి రెండు వైపులా కాదు.. కాదు.. తన పాళికి అన్ని వైపులా పదునే అని నిరూపించాడు.

తన అక్షర విత్తనాలను మనిషి మనసులో చల్లుతూ  సద్భావనలను మొలకెత్తించే అక్షర కర్షకుడు శ్రీశ్రీ. "కళ, కళ కోసం అంటే నేనొప్పుకోను. ఏ కళైనా సమాజాభ్యుదయానికి దోహదపడేదై ఉండాలి అదే దానికి సార్థకత" అని చాటినవాడు. అందుకే తాను బ్రతికినంత కాలం, సమాజంలోని జడాన్ని ఝళిపిస్తూ అక్షర సేద్యం చేయడమే కాక, తన మరణం తర్వాత కూడా సంఘహితం కోరి తన అవయవాలను తను పుట్టిన ఊరు, "విశాఖపట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి" రాసిచ్చిన అమరకవి

నేడు (ఏప్రిల్, 30) ఆ మహాకవి జయంతిని పురస్కరించుకుని స్మరించుకుంటూ..

- కొంపెల్ల శ్రీమూర్తి

Comments

  1. Awesome sir, Johar Sri Sri garu

    ReplyDelete
    Replies
    1. Ayyo aa pilupentandi..🙏🙏 by the way, meeru peru pedite baaguntundi gurtu pattadaaniki veeluntundi. Thank you.

      Delete
  2. ,😍👏👏👏👌👌👌sir

    ReplyDelete
    Replies
    1. Thank you. by the way, meeru peru pedite baaguntundi gurtu pattadaaniki veeluntundi. Thank you.

      Delete

Post a Comment

Popular posts from this blog

ఎవరు గురువులు?

"సేవ - అరుణోదయ సేవాశ్రం"