ఎవరు గురువులు?

ఆషాడ శుద్ధ పౌర్ణమిని ఆషాడ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం.

వేదవ్యాస మహర్షి అవతరించిన రోజునే వ్యాస పూర్ణిమ అంటాం.

వేదాలను విభజించి, వేదాలతోబాటు, మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలనూ రచించి, జగతికిచ్చిన వారు వేదవ్యాస మహర్షి.  లోకానికంతటికీ జ్ఞానాన్ని పంచిన వ్యాసభగవానుడు ఈ లోకానికే గురువు. కాబట్టి వ్యాస పూర్ణిమనే గురుపూర్ణిమగా జరుపుకుంటాం. గురువులను స్మరించుకుని, నమస్కరించుకుని తరిస్తాం.

మరి.. గురువు అంటే ఎవరు??

గుకార: అంధకారస్యాత్‌ రుకార: తన్నిరోధక: అంధకార నిరోధత్వాత్‌ గురురిత్యభిధీయతే

‘గు’ అనగా అంధకారము, ‘రు’ అనగా చీకటిని తొలగించే వెలుగు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి, జ్ఞానజ్యోతిని వెలిగించే వారే "గురువు"

గురువు ప్రాముఖ్యతను గురించి సంత్ కబీర్:

गुरु गोविंद दोनों खड़े, काके लागूं पाँय । 
बलिहारी गुरु आपनो, गोविंद दियो मिलाय ॥

- అని చెప్పిన దోహె ఇది. దాని అర్ధం: "గురువూ, భగవంతుడూ ఇద్దరూ ఒకేసారి నాముందుకి వస్తే.., ఆ భగవంతుడిని నాకు చూపిన (తెలిపిన) గురువుకే నేను ముందుగా నమస్కరిస్తాను / ప్రణమిల్లుతాను."

ఈ మాట చాలు, "గురుస్థానం" అన్నది ఎంత పవిత్రమైనదో, ఎంత బాధ్యతాయుతమైనదో తెలిపేందుకు.

ఆసేతు హిమాచలం ముమ్మార్లు కాలినడకన ప్రయాణించి, షణ్మతాలను ఏకం చేసి దేశంలో నాలుగు పీఠాలను స్థాపించి, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములకూ - మహాభాష్యములనూ, అలాగే దేవతా స్తోత్రములనూ రచించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించిన వారు - త్రిమతాచార్యులలో మొదటివారైన జగద్గురు ఆది శంకరాచార్యులు

ఇక వారి వలె అవతరించిన మిగిలిన ఇద్దరు  శ్రీ రామానుజాచార్యులు విశిష్టాద్వైత బోధనతోనూ, శ్రీ మధ్వాచార్యులు దేశమంతా పర్యటించి ద్వైత మతాన్ని ప్రచారం చేసీ.. స్వధర్మాన్ని కాపాడిన వారు.

సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారమైన శ్రీరాముడు, తన పదహారో ఏట వైరాగ్యవశుడైనప్పుడు అతనికి యోగాన్ని బోధించి కర్తవ్యోన్ముఖుని గావించారు వశిష్ఠ మహర్షి అదే "యోగవాసిష్ఠం"

కురుక్షేత్రంలో యుద్ధారంభానికి ముందు, శత్రు సైన్యంలో తన వారినీ, బంధువులనూ, గురువులనూ చూసి వారితో యుద్ధం చేయవలసి రావడంతో వికలుడైన అర్జునుడికి కర్తవ్యబోధ చేశాడు వాసుదేవుడు. ఆ కృష్ణార్జున సంవాదమే భగవద్గీత. పద్దెనిమిది (18) అధ్యాయాలున్న భగవద్గీతలో ఆత్మ తత్వము, జీవన కర్తవ్యము, భగవత్తత్వము, మొదలైన ఎన్నో విశేషాలు ఉన్నాయి.

శ్రీ రామకృష్ణ పరమహంస సకల మత మార్గాలలో సాధన చేసి విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా చాటిన మొదటి వ్యక్తి. స్వామీ వివేకానందుని ఉన్నతునిగా గుర్తించి జ్ఞానమకరందాన్ని అందించారు. తరువాతి కాలంలో వారి ద్వారానే శ్రీ రామకృష్ణుల బోధనలు విశ్వవ్యాపితమయ్యాయి.


శ్రీ రమణమహర్షి - పదహారో ఏటనే ఆత్మానుభూతిని పొంది, అరుణాచలం చేరి, సన్యసించారు. ఉపదేశం కోరి తన వద్దకు వచ్చిన భక్తులకు "స్వీయ శోధన" ఉత్తమమని బోధించిన వారు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎందరో మహనీయులు, ఋషులు, అవతారపురుషులు. ఇక్కడ కొందరి గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది.

వీరెవ్వరూ.. ప్రతిఫలం ఆశించక జగతిని ఉద్ధరించేందుకు అవతరించిన మహా పురుషులు.. అవతారమూర్తులు.

గురువు అనగా అర్ధమేమిటో మనం పైన తెలుసుకున్నాముగా.. మరి గురువులు అంటే వీరు.

జ్ఞాన జ్యోతిని వెలిగించి మనని మోక్షమార్గం వైపు నడిపించే వారు.

కానీ కాలగమనంలో.. కొత్త బాబాలూ, స్వయం ప్రకటిత గురువులూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి, ఈ పూజ్య గురువులందరూ పటాలకే పరిమితమైపోతున్నారు. నిజానికి, ఆ మహనీయుల చిత్రపటాలను సైతం పక్కకి నెట్టి ఈ స్వయం ప్రకటిత గురువుల పాదాలను పట్టుకునే స్థాయికి దిగిపోయాం.

అద్వైత తత్వాన్ని బోధించిన ఆదిశంకరులు జాతి కోసం, దేవతా స్తోత్రాలను రచించి ప్రార్ధించమంటే.. ఈ పుట్టుకొచ్చిన గురువులు తమని తామే గురువులని ప్రకటించుకోవటమే కాక, తమపై తామే  గురుస్తోత్రాలను రచించుకుని వారి పాదాలకు మొక్కవలసిందని వారి పాదుకల చిత్రపటాలను సైతం అమ్ముకుంటుంటే కనీస ఆలోచన చెయ్యలేక వాటిని పూజా స్థలంలో పెట్టి పూజిస్తున్న పైత్యం కూడా చూస్తున్నాం.

ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం పేరిట దాదాపు చాలామంది పాశ్చాత్య పాఠాలన, "మేనేజ్.మెంట్ లెసన్స్" అని నేర్పుతున్నారుగా.. ఆ అంశాలు మన ఇతిహాసాలు, గ్రంథాలూ, వేదాలలో నుండి క్రోడీకరించినవే అని తరచూ మనం వింటూనే ఉన్నామని గుర్తుచేస్తున్నాను.

యోగవాసిష్ఠమైనా, భగవద్గీత అయినా, మనసు వికలమై, మదిని నిరాశనిశీధి నిండినప్పుడు వైద్యమైనవే కదా. మరి మనకి వేరే వ్యక్తిత్వవికాస పాఠాలు కావాలా??   

ప్రస్తుత సమాజంలో మనసు వికలమై కొందరూ, ఒత్తిడికి గురై కొందరూ, ఆత్మస్థైర్యం లేక కొందరూ జీవితంలోని చిన్న చిన్న ఒడిదుడుకులను కూడా ఎదుర్కోలేక తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.

మరొకపక్క ఈ బోధనలని కాస్త ఆధునీకరించి అమాయకులను ఆకట్టుకుని ఆశ్రమాలు పెట్టి, బొమ్మల వ్యాపారం చేసుకునే బాబాలు, స్వయంప్రకటిత గురువులూ.   

ఆత్మస్థైర్యాన్ని పెంపొందించీ, మనోవికాసానికి తోడ్పడే ఎన్నో రత్నరాసులు మనకి అందుబాటులో, మన ఇళ్ళలోనూ, మనవద్దే ఉన్నా  వాటిని గుర్తించక మనం ఈనాడు ఈ స్వయంప్రకటిత గురువుల వద్దకు పరుగులు పెడుతున్నాం. వారికి కానుకలు సమర్పించుకుంటున్నాం. అంతర్వీక్షణం చెయ్యక అంతా కలయతిరుగుతున్నాం మన ఈ గందరగోళ పరిస్థితిని వారు అనుకూలంగా అన్వయించుకుని, మనకి వారు అంటగడుతున్న అనవసరాలను ఖరీదు చెల్లించి మరీ ఆహ్వానిస్తున్నాం.

కారణం..మన వద్దే ఉన్న వెలకట్టలేని నిధి విలువ మనకి తెలియకే.

గమనిక: పరికించి చూస్తే ప్రతీ మత గ్రంథమూ (అన్ని మత గ్రంథాలూ) ఒక వ్యక్తిత్వవికాస పాఠమే. ప్రతివారూ తమ పిల్లలకు బాల్యం నుండే వీటిని అలవాటు చేస్తే వారి జీవనవికాసానికి అది ఎంతో ఉపయోగం. అసలు నువ్వు అవన్నీ చదివావా? అంటే.. నిజానికి నేను ఇవి సంపూర్ణంగా అయితే చదవలేదు. కానీ, వినికిడి ద్వారానూ, పరిశీలించనంతవరకూ చెప్పాను.

 - శ్రీ మూర్తి కొంపెల్ల

Comments

  1. చాలా బాగా చెప్పావు మూర్తి 👏👍🙏🏻

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)

"సేవ - అరుణోదయ సేవాశ్రం"