"ప్రేరణ"
                                                         (ప్రేరణ హెల్పింగ్ సొసైటీ)

గమనిక: అనివార్య కారణాల వలన కాస్త ఆలస్యంగా (మూడు రోజుల అనంతరం) రాస్తున్న పోస్టు. 

నేను ఎంబీఏ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు.. ఓసారి నా స్టూడెంట్స్ కొందరు ఏదో బయటి ఈవెంట్ సందర్భంగా హడావిడిగా ఉండడం చూసి ఏమిటని అడిగితే వాళ్ళు చెప్పగా తెలిసింది. "ప్రేరణ హెల్పింగ్ సొసైటీ" వార్షికోత్సవ కార్యక్రమం జరపబోతున్నట్లూ, ఆ సొసైటీలో తాము కూడా సభ్యులనీ, సొసైటీ తరపున చేసే ప్రతి సేవా కార్యక్రమాలలో తామూ పాల్గొంటారనీ. 

అలా "ప్రేరణ హెల్పింగ్ సొసైటీ" గురించి మొదటిసారి విన్నాను. "ప్రేరణ" ఆ పేరే మొదట ఆకట్టుకుంది. సొసైటీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాక నిజంగానే ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. "ప్రేరణ" కలిగించింది. 
తోటి మనిషికి సహాయపడుతూ, నలుగురి జీవితాల్లో ఆనందం నింపుతూ బతకడమే జీవితానికి పరమార్థమని, తాము కూడా తమవంతుగా సమాజానికి పాటుపడాలని నిర్ణయించుకున్న కొందరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రేరణా పూర్వక ఆలోచనకు రూపమే "ప్రేరణ హెల్పింగ్ సొసైటీ (PHS)"

అలా తిరుపతిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కొందరు ఈ ప్రేరణ హెల్పింగ్ సొసైటీని స్థాపించారు. 2007 వ సంవత్సరంలో అతితక్కువ మందితో మొదలైన ఈ "ప్రేరణ" సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (Act No: 35 of 2001) క్రింద  "ప్రేరణ హెల్పింగ్ సొసైటీ - 415/2007" గా రిజిస్టరై తిరుపతి నగరంలోనూ, పరిసర ప్రాంతాల్లోని అక్షయక్షేత్రం, తెలుగు తల్లి ఓల్డేజ్ హోం, నవజీవన్ బ్లైండ్ రెలీఫ్ సెంటర్, వంటి పలు సేవా సంస్థలు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలకు వెళ్ళి, వారికి తమ వంతు సాయాన్ని, సేవలని అందిస్తూ ఎంతోమంది పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు.

ఇలా గత 17 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అవగాహనా ర్యాలీలు చేస్తూ, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ సమాజానికి ఎంతగానో దోహదపడుతోంది వీరి "ప్రేరణ". ఇంతింతై వటుడింతై అన్నచందంగా.. అలా అతి తక్కువ మందితో మొదలైన సొసైటీ ఎంతోమందికి ప్రేరణని ఇస్తూ ఏకీభవం కలిగిన మరెందరో విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి సభ్యులుగా చేరగా సంఖ్య పెరిగింది. 

తమ విద్యాభ్యాసకాలం ముగిశాక, తరువాతితరం విద్యార్థులకు సొసైటీ బాధ్యతలను అప్పజెప్పి, వారు ఆ కార్యక్రమాలను కొనసాగిస్తుండగా, వివిధ ప్రాంతాలలోని పూర్వ విద్యార్థులు పర్యవేక్షణ చేస్తూ, సొసైటీకి అండగా ఉండడం శ్లాఘనీయం.  ఇందులో కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులే కాక, తిరుపతిలోని పలు కళాశాలల నుండి వివిధ కోర్సులు చేస్తున్న ఎందరో విద్యార్థులు ఇందులో భాగమై ఉండడం విశేషం. 

సొసైటీ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల 22 సెప్టెంబర్ 2024 (ఆదివారం నాడు) "ప్రేరణ టీం", తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులోని "నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్" లోని విద్యార్థుల కోసం మిమిక్రీ కళాకారులచే "మిమిక్రీ అండ్ కల్చరల్ షో" ని నిర్వహించారు.

స్థానిక ప్రముఖ మిమిక్రీ కళాకారుడు "లక్ష్మీపతి" పలు సెలబ్రిటీల గొంతులను అనుకరించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్ పూర్వ విద్యార్థి "నరసింహ" పాఠశాల పట్ల కృతజ్ఞతతో, అంకితభావంతో హైదరాబాదు నుండి విచ్చేసి మిమిక్రీ చేసి విద్యార్థులను ఆనందపరిచాడు. కళాకారులు చేసిన మిమిక్రీ, నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్ విద్యార్థులను ఎంతగానో అలరించింది. 

కార్యక్రమానంతరం "ప్రేరణ టీం" అక్కడి విద్యార్థులకు వివిధ స్పోర్ట్స్ కిట్స్ ను అందించి, విద్యార్థులందరికీ ఐస్ క్రీం లను పంచిపెట్టారు. 

"నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్" అధ్యాపకులు రామ్మోహన్, యాజమాన్యం, శ్రీధర్ ఆచార్య గారు, పతంజలి గారు కార్యక్రమంలో పాల్గొని "ప్రేరణ టీం" ను, మిమిక్రీ కళాకారులను, అలాగే తమకోసం విచ్చేసి మిమిక్రీ చేసిన పూర్వ విద్యార్థి "నరసింహ" ను ఎంతగానో అభినందించారు. 

నవజీవన్ ప్రస్తుత విద్యార్థి, "రెడ్డప్ప" పూర్వంలో "పాడుతాతీయగా" కార్యక్రమంలో కూడా పాల్గొని ఉండడం విశేషం. కళాకారులు చేసిన మిమిక్రీ కి ప్రేరణ పొందిన నవజీవన్ ప్రస్తుత విద్యార్థి "విష్ణువర్ధన్" కూడా ముందుకు వచ్చి సినీ హీరో కళ్యాణ్ రామ్ గొంతును చక్కగా అనుకరించడం, మరికొందరు "నవజీవన్" విద్యార్థినులు పాటలు పాడడం ప్రశంసనీయం.

ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో, ఎంతోమందికి చేయూతగా నిలుస్తున్న "ప్రేరణ హెల్పింగ్ సొసైటీ" కి, ఆ సభ్యులకు అండగా నిలిచి విరాళాలను సమర్పించదలచిన దాతలు ఇక్కడ పొందుపరిచిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి     "లేదా"    UPI ID కి ఏదైనా యూపీఐ ఆప్ ద్వారా సదరు సొసైటీకి విరాళాలను సమర్పించి సాయపడవచ్చు.  అలాగే  సొసైటీ గురించిన మరిన్ని వివరాల కోసం క్రింద తెలిపిన సొసైటీ వెబ్సైట్ ను, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల అకౌంట్ ను సందర్శించగలరు.

QR CODE: 



UPI ID:
PHS@iob
సొసైటీ గురించి మరిన్ని వివరాల కోసం క్రింద తెలిపిన సొసైటీ వెబ్సైట్ ను, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల అకౌంట్ ను సందర్శించగలరు.
వెబ్సైట్:   
https://preranahelpingsociety.org/home/

సొసైటీ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్:
phs_team

Prerana Helping Society

ఫేస్బుక్ ఐడీ: 
Prerana Helping Society, Tirupathi



ఇట్లు,
శ్రీమూర్తి కొంపెల్ల 

Comments

Popular posts from this blog

ఎవరు గురువులు?

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)

"సేవ - అరుణోదయ సేవాశ్రం"