October 02, 2024 గాంధీ జయంతి సందర్భంగా


గాంధేయవాదానికి    'అ',   'ఆ'    లు
~~~~~~~~~~~~ * ~~~ * ~~~ * ~~
  గాంధీగిరీ కి ఆసరా.. గాంధీయిజానికి అవసరం.. వారిరువురు.

నేను గాంధేయవాదిని కాను. బళ్ళో చెప్పిన విషయాల వలన స్వాతంత్ర్యోద్యమాన్ని ఆది నుండీ నడిపిన వ్యక్తి గానూ, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఒకే ఒక్క వ్యక్తి గానూ మహాత్మా గాంధీని గూర్చి అభిప్రాయపడ్డాను. కాలక్రమేణా ఎందరో స్వాతంత్ర్య విప్లవవీరుల పోరాటాలను గురించీ, వారి త్యాగాలను గురించీ తెలుసుకున్నాక.. ఆలోచన మొదలైంది. అసలు మహాత్మాగాంధీ భారత దేశానికి రాకమునుపే ఊపిరిలూదుకున్న స్వాతంత్ర్యోద్యమ వివరాలు జ్ఞప్తి చేసుకున్నాక, నెమ్మదిగా నా ఆలోచనలు, అభిప్రాయాలు మారుతూ వచ్చాయి.

ఎంతోమంది భారత స్వాతంత్ర్య వీరులు, బ్రిటీషర్లకి వ్యతిరేకంగా తమ విప్లవ పోరాట స్ఫూర్తి రగిలించి, ఎదిరించి, నిలిస్తే మహాత్మాగాంధీ కేవలం అహింసాయుధంతో పోరాడడం నాకు మనస్కరించలేదు. (సరే అందుకు నా అర్హత ఏపాటి? ఇది కేవలం నా అభిప్రాయం అంతే) 

అలాగని మహాత్మాగాంధీ అంటే విముఖతో వ్యతిరేకతతో లేదు గానీ, గాంధేయమార్గం కన్నా స్వాతంత్ర్య వీరుల విప్లవపోరాట స్ఫూర్తి నన్ను ఎక్కువగా ఆకర్షించింది.

దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో ప్రపంచం నలుమూలలలోని ఏ వార్తైనా, ఏ విషయమైనా చిటికెలో తెలుసుకోగలుగుతున్న కాలంలో.. అటు ప్రయోజనకరంగానూ.. ఇటు ప్రమాదకారిగానూ.. కూడా పరిణమిస్తున్న కృత్రిమ మేధస్సు వలన వాస్తవాలు, అవాస్తవాల మధ్యన తేడాని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాం మనం.

చనిపోయిన ఎందరో మేధావులూ, మహనీయులనూ మన ముందుకి తీసుకురావడమే కాక వారి చేత మాట్లాడిస్తూ, ఆడిస్తూ, పాడిస్తూ, ఇంకా మన ఊహకి అందని విధంగా నటింపచేసేలా చేస్తోందీ కృత్రిమ మేధస్సు.

అలా వాస్తవాలను పక్కదారి మళ్ళిస్తూ మహాత్మాగాంధీని గురించీ, జవహర్లాల్ నెహ్రూ గురించీ సామాజిక మాధ్యమాలలో తప్పుడు వార్తలతో వచ్చిన పోస్టుల వలన మహాత్మాగాంధీ పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.

అయితే నాకు పరిచయమైన ఇద్దరు వ్యక్తులు చాలా విషయాలలో మహాత్మాగాంధీ పట్ల నాకు ఏర్పడిన దురభిప్రాయాన్ని (సంపూర్ణంగా కాకపోయినా చాలా మటుకు) చెరిపి, నన్ను ప్రభావితం చేశారు.

మహాత్మాగాంధీని గురించిన నా ఎన్నో అపోహల పొరలు, తెరలు తెరలుగా తొలగిస్తూ అవగాహన కలిగించిన, ఆ ఇద్దరు సిసలైన గాంధేయవాదుల గురించి చెప్పాలనిపించింది.

ఒకరు ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు (ఆకాశవాణి, రీజనల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీ మీడియా విభాగం, హైదరాబాద్), ప్రముఖ రచయిత, సంకలనకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ కాగా మరొకరు, "సంస్కార్ ఫౌండేషన్" చైర్మన్ సంస్కార్ రాజేష్.

డా|| నాగసూరి వేణుగోపాల్ గారు తన విశ్రాంత జీవితంలో కూడా విరామమెరుగక సైన్సు, సాహిత్యం, విజ్ఞానం, జర్నలిజం, మొదలైనటువంటి ఎన్నో విభిన్న అంశాలలో వ్యాసాలూ, పుస్తకాలూ రాస్తూ.. సంకలనాలు, సంపాదకీయాలు చేస్తూ జనావళికి జ్ఞానగుళికలను అందిస్తూండగా..

సంస్కార్ రాజేష్, 'సేవ' అన్న మాటకి పర్యాయపదంగా నిలుస్తూ సమాజహితం కోరి... "సంస్కార్ ఫౌండేషన్" ను స్థాపించి నిత్యం సేవా కార్యక్రమాలలో నిమగ్నమవడమే కాక, సంగీత, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలనెన్నో నిర్వహిస్తూ.. పర్యావరణ పరిరక్షణా అవగాహనా కార్యక్రమాలు, ఆరోగ్య సూచనలూ, కేన్సర్ గురించిన అవగాహన కలిగిస్తూన్నారు.

జనహితం తమ అభిమతంగా, గాంధీయిజం తమ మతంగా అడుగులు వేస్తూ వీరిరువురూ "జాతిపిత" సిద్ధాంతాలను, జనాలలోకి మరింత లోతుగా తీసుకెళ్తూ, తాము గాంధేయ మార్గాన్ని అనుసరిస్తూ, అనుక్షణం సంఘానికి గుర్తు చేస్తూ, గాంధీజీ స్ఫూర్తిని రగిలిస్తున్నారు.

Dr. NAGASURI VENUGOPAL:
"అసలైన విప్లవవాది సిసలైన సిద్ధాంతకర్త - గాంధీజీ",  "మహా స్వప్నం మహాత్మా గాంధీ", నాలుగు భాగాలలో  "గాంధీయే మార్గం", మొదలైనటువంటి తాను రచించిన ఎన్నో పుస్తకాల ద్వారా, "ఈ తరానికి తెలియని గాంధీజీ" ని గురించి వ్యాఖ్యానిస్తూ, యూట్యూబ్ లో వివిధ ఛానెళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా, అలాగే ఆంధ్రప్రభ దినపత్రికలో 2020 జూలై చివరివారంలో మొదలైన "గాంధేయం గాండీవం" శీర్షికన తన వ్యాసాల ద్వారా డా || నాగసూరి వేణు గోపాల్ గారు గాంధీజీని గురించి తెలియని, వెలుగులోకి రాని, అబ్బురపరిచే ఎన్నో విషయాలను, విశేషాలను ఇలా తన వ్యాసాలు, వ్యాఖ్యానాలు, రచనల ద్వారా తెలియజేస్తున్నారు.

SAMSKAR RAJESH:
పైన చెప్పినట్టు అటు ప్రయోజనకరంగానూ.. ఇటు ప్రమాదకారిగానూ.. కూడా పరిణమిస్తున్న కృత్రిమ మేధస్సు వలన వాస్తవాలు, అవాస్తవాలను గుర్తించలేనటువంటి ఈ కాలంలో.. సామాజిక మాధ్యమాలలో ఎక్కడైనా మన స్వాతంత్ర్య అమర వీరుల ఫోటోలు లభించినా, వాటి వాస్తవికతని ఒకటికి రెండుసార్లు సమీక్షించుకుని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎంతటి గొప్పవారినైనా,  అభిమానించేవారు ఉన్నట్టే వ్యతిరేకించేవారూ ఉంటారు. కేవలం వ్యతిరేకించి ఊరుకునే వారితో ఇబ్బంది లే(ఉండ)కపోవచ్చును కానీ దుష్ప్రచారాల బురద జల్లి వ్యక్తిత్వ హననం చేసి ఆనందించే వారి వల్లనే అసలు సమస్య.

అంతర్జాలంలో అటు మహాత్మగాంధీ గురించి అయితేనేమి జవహర్లాల్ నెహ్రూ గురించి అయితేనేమి, అవాస్తవాలతో, మార్ఫింగ్ చేసిన ఫోటోలతో కల్పిత వార్తలతో దుష్ప్రచారం చేస్తుంటే.. వాటి వాస్తవికతను నిరూపిత ఆధారాలతో ప్రచురిస్తూ, ప్రచారం చేస్తూ, అలాగే ప్రతి సంవత్సరం అక్టోబర్ 02 తేదీన గాంధీ జయంతి నాడు గాంధీజీ ని గురించి తెలియని ఎన్నో వాస్తవాలను, విశేషాలను వెలుగులోకి తెస్తూ "గాంధీజీ జీవిత విశేషాల ఛాయాచిత్ర ప్రదర్శన" నిర్వహిస్తూ "సంస్కార్ రాజేష్" గాంధీజీ సిద్ధాంతాలకు జీవం పోస్తున్నారు.  

"అ"క్షరాల్లో ఆయన (Dr Nagasuri Venugopal గారికి)
"ఆ"చరణలో ఈయన (Samskar Rajesh గారికి)

వ్యాసాలతో వారు (Dr। NAGASURI Venugopal),
వాస్తవాలను విశ్లేషిస్తూ వీరు (Samskar Rajesh)

గాంధీ 'ఇజం' గురించి వ్యాఖ్యానిస్తూ వారు (Dr Nagasuri Venugopal)
తప్పుడు వార్తలను తూర్పారపడుతూ నిజానిజాలను వెలుగులో చూపుతూ వీరు (Samskar Rajesh)

"అ"వగాహన కలిగిస్తూ.. "ఆ"లోచింపచేస్తూ గాంధేయవాదాన్ని మోస్తున్నారనే చెప్పాలి.

మహాత్మాగాంధీ గురించి వీరు చేస్తున్న కృషిని చూసి అనిపిస్తుంది.. 
"మహాత్మా గాంధీ" ఆయన (Samskar Rajesh) కి   "జీవన విధానం"
ఈయన (Dr Nagasuri Venugopal) కి    "జీవితం"

గమనిక:
మహాత్మా గాంధీ గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు, అలాగే డా|| నాగసూరి వేణుగోపాల్ గారి వివిధ ఇంటర్వ్యూలు, వ్యాఖ్యానాలు, జర్నలిజం గురించి వారు ఇచ్చిన ఉపన్యాసాల కోసం, యూట్యూబ్ లో Dr Nagasuri Venugopal అని సెర్చ్ చేస్తే వారికి సంబంధించిన బోలెడు వీడియోలను చూడవచ్చు.

స్వస్తి
శ్రీమూర్తి కొంపెల్ల

Comments

Popular posts from this blog

ఎవరు గురువులు?

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)

"సేవ - అరుణోదయ సేవాశ్రం"