నా కోసం ప్రయత్నించే ..నీకోసం నిరీక్షిస్తూ...
ప్రియమైన నీకు...
నేనే.
అవును స్వయానా నేనే...నీకు రాస్తున్న లేఖ.
ప్రపంచమంతా
ప్రేమ నిండి ఉంది. నేడు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ
వారి ప్రేమని వ్యక్తపరుస్తుంటే..నాకు కూడా ఈరోజు నా మనసులోని మాట నీకు
చెప్పాలనిపించింది. నువ్వు నన్ను ప్రేమించావు. నాకు తెలుసు. నాకోసం నువ్వు
కొన్నాళ్ళు నిరీక్షించావు కూడా. కానీ నా నుండి స్పందన లేదన్న ఒక అపోహతో
నేను నిన్ను అంగీకరిస్తానో లేదోనన్న అనుమానంతో నువ్వు "తనని" కలిసావు.. "తనతో"నే ఉండిపోయావు.
నేను కాదంటానేమో అన్న ఒక అపోహతో నువ్వే తన వెనక పడ్డావు. "తనని" వరించావు. కానీ...
...నువ్వు
నన్నెంతగా ప్రేమించావో నేను కూడా నిన్ను అంతగా ప్రేమించానని నీకు తెలుసా?
అనుక్షణం నేను నిన్నంటిపెట్టుకునే వచ్చాను..ప్రతీ క్షణం నీ నీడలా నీ వెనకే
వచ్చాను కానీ నువ్వు నన్ను గుర్తించలేదు. ఇది కాకపోతే అది..అది కాకపోతే మరొకటి అనుకునే వరస నీది. దానికి తోడు నీ "స్నేహితుల" సహచర్యం నీ నమ్మకాన్ని బలహీనపరిచింది, నా పైన నీ ప్రేమను తుంచి వేసింది. వారిని కాకుండా నీ అంతరాత్మను నమ్ముకుని నువ్వు ప్రయత్నించి ఉంటే నీకు నేను దక్కేదాన్ని కదా. "అదే నువ్వు చేసిన తప్పు". (నువ్వే కాదులే నీలా ఎంతో మంది చేసే తప్పు)
కానీ నేను అలా కాదు. నాకోసం నువ్వెంత పరితపించావో, నువ్వు నన్ను పొందాలని కూడా నేనూ అంతగానే పరితపించాను. కానీ నీకు నువ్వే ఒక పరిమితి ఏర్పరచుకున్నావు.
దానికి నేను కారణమా? ఎంతమాత్రమూ కాదు.
Yes! I may be tough. But reaching me is not impossible.
నీకు,
నాకు ఒక్కటే తేడా. నువ్వు నా పట్ల నీ ప్రేమని వ్యక్తపరిచావు. నేను
వ్యక్తపరచలేదు అంతే. నీలాగే ఎంతోమంది నన్ను పొందాలనుకున్నారు, కానీ కొద్ది
మందే నన్ను చేరుకున్నారు. చాలామంది మధ్యలోనే "తనతో" వెళ్ళిపోయారు.
అందుకే ఇప్పటికీ నేను నీకోసం అలాగే వేచి ఉన్నాను.ఇప్పుడే కాదు..నువ్వు "తనని" ఒప్పుకోకుండా నాకోసం ప్రయత్నించినంత కాలం, నేను నీ వెన్నంటే ఉంటాను అది గుర్తుంచుకో.
ఇకనైనా నువ్వు చెడుసావాసాలు ("నిరాశ", "నిస్పృహ"లు) మాని, తనని(ఓటమిని) వదిలి మన కలయికను బలంగా నమ్మి ఆత్మవిశ్వాసంతో నాకోసం ప్రయత్నించు.
నీకోసం నిరీక్షిస్తూ...
"గెలుపు"
Comments
Post a Comment